కరోనా వ్యాప్తి కారణాలు.. ఎంపీ రేవంత్ సూచనలు..


భావోద్వేగాలు చల్లారిన తర్వాత వాస్తవాలు ఎరుకకు వస్తాయి. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇలాంటప్పుడే మేథావులు, బుద్ధిజీవులు చొరవ చూపాలి. భావోద్వేగపు అగ్నిగుండం నుండి నిప్పుకణికల్లాంటి నిజాలను వేరు చేసి ప్రజల ముందు ఉంచాలి. పాలకులు తీయ్యటి మాటలతో సామాన్యుడిని ఊహాప్రపంచంలో విహరింప జేస్తున్నప్పుడు ఆ ఊహాను చెదరగొట్టి వాస్తవంలోకి తీసుకురావడం అవసరం. కొంత కఠినమే కావచ్చు. కానీ, అది ఊహ... ఇదిగో ఇదీ వాస్తవం అని చెప్పడమే సమాజహితులు చేయాల్సిన పని. ఊహ చెదిరినప్పుడు కలిగే నిరుత్సాహం తాత్కాలికం. నిజం చేసే మేలు శాశ్వతం. అందుకే... ఈ వ్యాసం రాయాలని సంకల్పించాను.

ప్రపంచం కరోనా గుప్పిట్లో చిక్కి వంద రోజులు దాటింది. వైరస్ అంతం ఎప్పుడు అన్నది ఇంకా స్పష్టత లేదు. ఈ విపత్తు మనిషికి అనేక పాఠాలు నేర్పింది. దేశాలు గుణపాఠాలు నేర్చుకున్నాయి. ముందుగా మేల్కొన్న దేశాలు కొంత భద్రంగా ఉన్నాయి. నిర్లక్ష్యం చేసిన దేశాలు మూల్యం చెల్లించుకుంటున్నాయి. ఇందులో మనదేశం ఎటువైపు ఉంది? కరోనా కార్యచరణలో ప్రస్తుతం మనం ఎక్కడున్నాం? వైరస్ కు ముందు – తర్వాత మన దేశంలో ఏం జరిగింది... ఏం జరగబోతోంది? మలి దశ లాక్ డౌన్ ముంగిట నిక్కచ్చిగా సమీక్షించుకోవాల్సిన సందర్భం ఇది.

పాలకుడికి ముందు చూపు ఉండాలి. విపత్తుల సమయంలో అప్రమత్తత ఉండాలి. నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఈ రెండు సుగుణాలు లేవు. ఫలితం... మోదీ నిర్లక్ష్యం దేశాన్ని స్థంభింపజేసింది. నేను ఈ విమర్శ చాలా గట్టిగా చేస్తున్నాను. నా విమర్శకు ప్రాతిపదిక ఉంది. అదేమిటన్నది ఇప్పుడు వివరిస్తాను. కరోనా మన పొరుగుదేశం చైనాలో పుట్టింది. గత ఏడాది డిసెంబర్ లో వుహాన్ నగరంలో వైరస్ మొదటిసారి పడగ విప్పింది. ఈ వైరస్ లక్షణాలు ఏమిటి? మనిషి నుంచి మనిషికి ఎలా వ్యాపిస్తోంది? అది ఎంత ప్రమాదకరం అన్నది ప్రపంచానికి తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. వుహాన్ నగరమే ఓ ప్రయోగశాల. అది తన అనుభవాలతో ప్రపంచాన్ని హెచ్చరించింది. నిర్లక్ష్యం చేసిన వాళ్లు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ప్రపంచ పెద్దన్నగా విర్రవీగే అమెరికా కేవలం నిర్లక్ష్యం కారణంగా ఈ రోజు అతలాకుతలం అవుతోంది. యూరోపియన్ దేశాల పరిస్థితి దాదాపు ఇదే. మోదీ మాదిరిగానే ట్రంప్ మంచి మాటకారి. ఆ మాటల గారడీ అగ్రరాజ్యాన్ని కరోనా నుంచి కాపాడలేకపోతోంది.

మోదీ నిలువెల్లా నిర్లక్ష్యం...

వుహాన్ లో కరోనా పుట్టిన తర్వాత సుమారు 45 రోజులకు మనదేశంలో మొదటి కేసు నమోదైంది. వుహాన్ నగర యూనివర్సిటీలో చదువుతోన్న కేరళ విద్యార్థి ద్వారా వైరస్ మనదేశంలోకి వచ్చింది. అక్కడ నుంచి వచ్చిన విద్యార్థికి వైరస్ లక్షణాలు ఉన్నట్టు జనవరి 30న గుర్తించారు. భారత్ కు ఇది మొదటి హెచ్చరిక మాత్రమే కాదు. మొదటి నిర్లక్ష్యం కూడా. వుహాన్ పేరు వింటేనే ప్రపంచం వణికిపోతున్న సందర్భంలో నేరుగా ఆ నగరం నుండి మనదేశానికి వైరస్ దిగుమతైంది. శ్రీ రాహుల్ గాంధీ ఫిబ్రవరి 12న చేసిన హెచ్చరికను పట్టించుకోకపోవడం మోదీ రెండో నిర్లక్ష్యం. “కరోనా, దేశ ఆర్థిక వ్యవస్థనే కాదు, ప్రజల ప్రాణాలనూ కబళించబోతోంది. ఈ విపత్తును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటున్నట్టు నాకు అనిపించడం లేదు. తక్షణ చర్యలు అవసరం” అని రాహుల్ ట్వీట్ చేశారు. ఐతే, మోదీ బృదం అప్పటికి వేరేపనిలో బిజీగా ఉంది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కారును కూల్చి, గద్దెనెక్కేందుకు పావులు కదుపుతోంది. రాహుల్ హెచ్చరిక చెవికెక్కించుకునే తీరిక వారికి లేదు. ప్రపంచం మొత్తం సోషల్ డిస్టెన్స్ అని నినదిస్తోన్న సందర్బంలో తన దోస్త్ ట్రంప్ కోసం మోదీ ‘నమస్తే ట్రంప్’ పేరుతో అహ్మదాబాద్ లో లక్షల మందితో సభ నిర్వహించారు. ఫిబ్రవరి 24న ఇది జరిగింది. ఇది మోదీ మూడో నిర్లక్ష్యం. విచిత్రమేమిటంటే... అప్పటి వరకు కరోనాపై కేంద్రం ఒక్క సమీక్షా చేయలేదు. జనవరి 30న మొదటి కేసు నమోదైతే మొదటి సమీక్ష మార్చి మూడున జరిగింది. నెల రోజులకు పైగా కేంద్రం జెస్ట్ చోద్యం చూసింది అంతే! వైరస్ సోకిన ఇతర దేశాల అనుభవాలు చూసి జాగ్రత్తపడటానికి మనకు 45 రోజుల సమయం ఉండింది. ఆయా దేశాల అనుభవాలను కాపీ కొట్టినా మనదేశంలోకి వైరస్ రాకుండా నియంత్రించ గలిగి ఉండేవాళ్లం. “నకల్ మార్నేకో బి... అఖల్ రహనా” అని తెలంగాణలో ఒక సామెత ఉంది. మోదీ సర్కారు అది కూడా చేయలేకపోయింది.

ఇక ఢిల్లీలో తబ్లీగి సదస్సు విషయానికి వద్దాం. ముంబైలో సదస్సుకు అనుమతివ్వమని మార్చి8న తబ్లీగి ప్రతినిధులు మహారాష్ట్ర సర్కారుకు దరఖాస్తు చేసుకున్నారు. కరోనా కారణంగా అక్కడ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. తదుపరి ఢిల్లీలోని నిజాముద్దీన్ లో సదస్సుకు అనుమతి ఇచ్చారు. ముంబైలో రాని అనుమతి ఢిల్లీలో ఎలా వచ్చింది? అనుమతి ఇచ్చింది ఎవరు? ఢిల్లీకి సీఎం కేజ్రీవాల్ కావచ్చు. కానీ, అక్కడ లా అండ్ ఆర్డర్ ఆయన చేతుల్లో ఉండదు. ‘నేషనల్ కాపిటల్ టెరిటరీ’ కనుక ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ సర్వాధికారాలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖవే. అంటే... కేంద్ర హోం శాఖకు ఈ సదస్సు పై స్పష్టమైన సమాచారం ఉంది. ఈ సదస్సు జరిగే సమయానికి ఢిల్లీలో వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యయి. ఐనా, తబ్లీగికి అనుమతి ఇవ్వడం మోదీ నాలుగో నిర్లక్ష్యం. ఈ సదస్సుకు విదేశాల నుంచి 2,100 మంది వచ్చినట్టు హోం శాఖ చెబుతోంది. ఇందులో అత్యధికులు ఇండోనేషియా, మలేషియా, థాయ్ లాండ్ నుంచి వచ్చారు. వారు వచ్చే సమయానికి ఆ దేశాలలో వైరస్ వ్యాప్తి ఉదృతంగా ఉంది. ఐనా, వారిని కేంద్రం మన దేశంలోకి అనుమతించింది. మార్చి 13న కొత్తగా వచ్చేవారి వీసాలు రద్దు చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తబ్లీగి సదస్సుకు అనుమతివ్వడం నిర్లక్ష్యమా లేక దురుద్ధేశమా అన్న సందేహాలు ఉన్నాయి. ఈ సదస్సు కారణంగా వైరస్ వ్యాప్తి ఒక్క సారిగా ఉదృతమైంది. ఇది సమాజంలో అంతర్లీనంగా విద్వేషపు చర్చకు తెరలేపింది. ఈ చర్చ అసంకల్పితమే. బీజేపీకి కావాల్సింది కూడా అదే. చేతికి మట్టి అంటకుండా పని జరిగిపోవాలి. తబ్లీగి సదస్సుకు అనుమతి వెనుక దురుద్ధేశం ఉందేమో అన్న సందేహానికి కారణం ఇదే. ఈ రాజకీయ క్రీడలో సలహాలు చెవికెక్కించుకోకపోవడం కూడా ఒక వ్యూహమేనేమో! మోదీ నిర్లక్ష్యం బీజేపీకి అవసరం, సమాజానికి నష్టం. వాళ్లకు ఓటు బ్యాంకు పునరేకీకరణ కావాలి. అది అంతర్లీనంగా జరిగిపోతుంది. సామాన్యుడే సమిథ. దేశానికి కొన్ని లక్షల కోట్ల నష్టం జరిగింది. ఆకలితో పేదలు అలమటిస్తున్నారు. భవిష్యత్తు ఏమిటని మధ్యతరగతి బెంగ పెట్టుకుంది. ఉద్యోగ భద్రత క్వశ్చన్ మార్క్ అయింది. కార్మికుడుకి ఉపాధి... పరిశ్రమకు భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యాయి. మోదీ ఆరేళ్ల విధ్వంసానికి ఇప్పుడు జరగబోయేది ఫినిషింగ్ టచ్. మూలిగే భారత ఆర్థిక వ్యవస్థ పై కరోనా వచ్చిపడింది... అంతే తేడా! రేపటి నుంచి మోదీ తప్పుల్ని, వైఫల్యాల్ని కరోనా మోస్తుంది. కరోనా దేశానికి మహమ్మారి. మోడీ బృందానికి స్వీయరక్షణాస్త్రం.

అతనికంటే ఘనుడు మన ఆచంట మల్లన్న...

మోదీ తీరు ఇలా ఉంటే... కేసీఆర్ ఆయన కంటే ఘనుడు. ఎమ్మెల్యే సీతక్క అసెంబ్లీ సాక్షి గా కరోనా హెచ్చరిక చేశారు. జాగ్రత్తలు తీసుకోమని సూచించారు. సీతక్క సూచనలను కేసీఆర్ తేలిగ్గా తీసుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హేళనగా మాట్లాడారు. ఆ వైరస్ కు పారసిటమల్ వేసుకుంటే చాలని, సైంటిస్టు చెప్పాడని నిర్లక్ష్యాన్ని, అహంకారాన్ని కలగలిపి మాట్లాడారు. కొంప మునిగాక మేలుకొన్న కేసీఆర్ కరోనా భయంకరమైన వ్యాధి అంటూ గగ్గోలు పెట్టారు. విపత్తు వచ్చినప్పుడు విజ్ఞులు ఏం చేయాలి. వైద్య నిపుణులు, ఇతర పక్షాల సలహాలు తీసుకోవాలి. ప్రపంచం మొత్తాన్ని అవపోసన పట్టడానికి కేసీఆర్ అపర మేథావి, ఆయన కుమారుడు ఏమైనా బాలమేథావా!? సలహాలు ఇచ్చేవారిని హీనంగా చూడటం, అజ్ఞానులుగా చిత్రీకరించడం కేసీఆర్ కు ఫ్యాషనైపోయింది. రెండు జిల్లాల పరిధిలో బత్తాయి రైతులను ఆదుకోలేని కేసీఆర్ 33 జిల్లాలలో వరి, మొక్కజొన్న పంట మొత్తం కొంటామంటున్నారు. పనిమంతుడు పందిరి వేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందట. కేసీఆర్ మాటలు, చేతలు ఇలాగే ఉన్నాయి.

భవిష్యత్ ఏమిటి...!?

కరోనా తర్వాత దేశ భవిష్యత్ ఏమిటి అన్నది ప్రశ్న. పాలకులు ఇప్పటికైనా విజ్ఞతతో వ్యవహరించాలి. అహంకారం వీడాలి. ఇది మావాళికి వచ్చిన ముప్పు. మోదీ, కేసీఆర్ ఇంటి వ్యవహారం కాదు. ప్రజల ప్రాణాలు, దేశ భవిష్యత్ కు సంబంధించిన అంశం. మీ నిర్లక్ష్యం వల్ల కరోనా వచ్చేసింది. ఇప్పుడు లాక్ డౌన్ తప్ప మరోమార్గం లేదు. తుపాను వెలిసిన తర్వాత పరిస్థితులను సరిదిద్దడానికి ప్రణాళికలు రచించుకోవాల్సిన సమయం ఇది. అమెరికా, జపాన్ లాంటి దేశాలు ఇప్పుడు అదే చేస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్యాకేజీలు, ఉద్ధీపనలతో భవిష్యత్ పై నమ్మకం సడలకుండా చేస్తున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి తగ్గకుండా నగదు చలామణి పెరిగేలా నిబంధనలు సడలిస్తున్నాయి. ఉపాధి, ఉద్యోగ భద్రతకు ప్రభుత్వాలు గ్యారెంటీ ఇస్తున్నాయి. చైనాలో తమ దేశానికి చెందిన ఉత్పత్తిరంగ సంస్థలను జపాన్ వెనక్కు పిలిపించుకుంటోంది. ఆ పరిశ్రమలను స్వదేశంలో ఏర్పాటు చేసుకోవడానికి ప్రోత్సాహకాలు ఇస్తోంది. తద్వారా దేశ ప్రగతిలో భాగస్వాములను చేయడంతో పాటు, ఉద్యోగ-ఉపాధికి హామీ ఇస్తోంది. అమెరికా ప్రకటిస్తోన్న ప్యాకేజీలైతే మనం కలలో కూడా ఊహించలేం. ప్రైవేటు సంస్థల ఉద్యోగులకు మూడు నెలల పాటు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తోంది. ఆ మొత్తాన్ని సదరు కంపెనీ యజమాని వచ్చే 30 ఏళ్ల వ్యవధిలో ఒక్క శాతం వడ్డీతో చెల్లించే వెసులుబాటు కల్పించింది. ఈ విపత్తు సమయంలో ఉద్యోగులను తొలగించని కంపెనీలకు అమెరికా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. కంపెనీ పేరోల్ కు రెండున్నర రెట్లు గ్రాంట్ గా ఇస్తోంది. అంటే ఒక సంస్థ తన ఉద్యోగులకు నెలకు రూ.10 లక్షలు జీతాలు చెల్లిస్తుంది అనుకుంటే ఆ కంపెనీకి జూన్ ఆఖరులో రూ.25 లక్షలు ప్రోత్సాహకం అందుతుందన్న మాట. మనదేశంలో ఇలాంటివి ఊహకు కూడా అందవు. నెలవారి ఈఎంఐలకు మూడు నెలల మారటోరియం విధించిన మోదీ ప్రభుత్వం ఆ తర్వాత వడ్డీతో వసూలు చేయబోతోంది. ఇదీ ఆ దేశాలకు, మనకు తేడా.
మోదీ జీ ఇలా చేయండి.. 
లేబర్ వ్యయం తక్కువ కావడంతో ఇన్నాళ్లు ఉత్పత్తి రంగానికి చైనా కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. అమెరికాతో సహా చాలా దేశాలు అనేక రకాల ఉత్పత్తుల కోసం చైనాపై ఆధారపడ్డాయి. తమ దేశాలలో వాతావరణ పరిస్థితులు, లేబర్ వ్యయం అధికంగా ఉండటం వల్ల అవన్నీ కేవలం సేవా రంగానికే పరిమితం అయ్యాయి. కరోనా నేపథ్యంలో ఆ దేశాలకు చైనా పట్ల విశ్వాసం పోయింది. ఇకపై తమకు అవసరమైన ఉత్పత్తుల కోసం మరో గమ్యాన్ని అన్వేషించుకునే పనిలో ఆయా దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ గమ్యం భారతదేశం కావాలి. దీనికి కేంద్రం చొరవ తీసుకోవాలి. మోడీ ఆరేళ్ల పాలనలో స్కిల్ ఇండియా, మేకిన్ ఇండియా నినాదం ఆచారణలో చతికిలపడింది. కరోనా సంక్షోభం ఇప్పుడు మనకు ఓ అవకాశం. పెట్టుబడుల ఆకర్షణ పేరుతో మోదీ ఈ ఆరేళ్లలో చాలా దేశాలు తిరిగారు. పెద్దగా ఫలితాలు సాధించింది లేదు. పదికోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ నెరవేరలేదు. కనీసం ఇప్పుడైనా మేల్కోండి. చైనా నుంచి నిష్క్రమిస్తోన్న ఇతర దేశాలకు చెందిన బహుళజాతి ఉత్పత్తిరంగ సంస్థలు భారత్ ను తమ తదుపరి గమ్యంగా ఎంచుకునేలా కార్యచరణ తీసుకోండి. తద్వారా స్కిల్ ఇండియా, మేకిన్ ఇండియా నినాదం సాకారమవుతుంది. 2022 నాటికి ప్రపంచంలోనే భారత్ యంగెస్ట్ కంట్రీగా ఉండబోతోంది. మన ప్రజల సగటు వయస్సు 29 సంవత్సరాలుగా ఉండబోతోంది. ఈ సందర్భంలో ఉద్యోగాల కల్పన ప్రభుత్వాలకు ప్రథమ ప్రాధాన్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. చైనాకు గుడ్ బై చెబుతోన్న బహుళజాతి ఉత్పత్తిరంగ సంస్థలను మన దేశానికి రప్పించడం ద్వారా నిరుద్యోగ సమస్యను చాలా వరకు అధిగమించవచ్చు.

రాష్ట్ర ప్రభుత్వం రెండు విషయాలపై తక్షణం దృష్టి పెట్టాలి. వైద్యం, వ్యవసాయం ఈ రెంటి కోసం ‘గ్రీన్ ఛానెల్స్’ను రూపొందించాలి. ముఖ్యమంత్రి విలేఖరుల సమావేశాల లో చెప్పినంత గొప్పగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు లేవు. ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలు అందిస్తోన్న వైద్యులకు రక్షణ లేదు. పీపీఈ కిట్లు లేక వైద్యులు ఆందోళనలో ఉన్నారు. కరోనా ఆసుపత్రుల్లో సదుపాయాలు అధ్వాన్నంగా ఉన్నాయి. సమస్యలను లేవనెత్తితే ప్రభుత్వ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వైద్యులు, ఇతర సిబ్బంది సేవలు అందిస్తున్నారు. సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్ అన్నట్టు లౌక్ డౌన్ తో కరోనా వ్యాప్తిని నియంత్రించవచ్చునని భావించడం సరికాదు. మొత్తం కార్యచరణలో లాక్ డౌన్ ఓ భాగం మాత్రమే. వ్యాధి నియంత్రణ, నివారణలో ఇతర దేశాల అనుభవాలు మన ముందున్నాయి. ట్రేస్... టెస్ట్... ట్రీట్ పద్ధతి అవలంభించిన దేశాలు విజయం సాధించాయి. తెలంగాణలో ఈ పద్ధతి అమలు చేయడం లేదు. మర్కజ్ కి వెళ్లి వచ్చిన వాళ్లను ఈ రోజుకీ పూర్తిగా ట్రేస్ చేయలేకపోతున్నారు. ట్రేస్, టెస్ట్, ట్రీట్ విధానాన్ని తక్షణం అమలు చేయండి. టెస్టుల ఫలితాలు రావడానికి నాలుగు నుంచి ఆరు రోజుల సమయం తీసుకుంటున్నారు. ఇది అనుమానితులకు మానసికక్షోభ కలిగిస్తోంది. ఎక్కువ మందికి టెస్టులు చేయడం, త్వరగా ఫలితాలు రాబట్టడం సమస్య పరిష్కారంలో కీలకమైన విషయం అని నిపుణులు చెబుతున్నారు. త్వరగా ఫలితాలు వచ్చే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని చెబుతున్నారు. అయినా, తెలంగాణలో ఫలితాల రాకకు నాలుగు రోజులు ఎందుకు పడుతోందో అర్థం కావడం లేదు. సమస్యను తక్కువ చేసి చూపండ వల్ల లాభం లేకపోగా... ప్రజల్లో అప్రమత్తత లోపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాలు చెప్పి, వాయువేగంతో సంపూర్ణ కార్యచరణకు సిద్ధం కావాలి. కరోనా నేపథ్యంలో మిగత వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడే వారిని పట్టించుకున్న నాథుడు లేడు. రాష్ట్రంలో ఏ మూల, ఏ చిన్న ఆరోగ్య సమస్యతో వ్యక్తులు బాధపడుతున్నా తక్షణం వెళ్లి వైద్యం అందించేలి. ఓ వైపు కరోనా, మరవైపు అత్యవసర వైద్య సేవల అమలుకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య వ్యవస్థలను సమీకృతం చేస్తేనే ఇది సాధ్యం.

వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో గ్రీన్ ఛానెల్ అవసరం ఉంది. ధాన్యం మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెబుతున్నారు. మంచిది! దానికి తగ్గ వ్యవస్థ సిద్ధం చేశారా? పొలంలో పంట ఇంటికి చేరే అవకాశాలు కల్పిస్తున్నారా? కొనుగోలు చేసిన ధాన్యం గోదాములకు చేరే మార్గం ఉందా? అకాల వర్షాలతో నష్టపోతోన్న రైతుల పరిస్థితి ఏమిటి? నెల రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతోంది. మళ్లీ విత్తనాలు, ఎరువుల అవసరం ఉంటుంది. దానికి కార్యచరణ సిద్ధమైందా? ఈ మొత్తం వ్యవహారం సాఫీగా సాగాలంటే వ్యవసాయ గ్రీన్ ఛానెల్ ఏర్పాటు అత్యవసరం. భేషజాలకు పోకుండా ముఖ్యమంత్రి వీటిపై దృష్టి పెట్టాలి.

ఇది సంక్షోభ సమయం. ఇప్పుడు ఇతర దేశాల నుంచి మనం నేర్చుకోవాలి. మన ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయం, పేదల సంక్షేమం, మధ్య తరగతి జీవితాలు ఇబ్బందుల్లో పడకుండా కాపాడుకోవాలి. ఇలాంటి సందర్భంలో ఆర్థిక నిపుణుల సలహాలు అవసరం. వారి సలహాలతో ప్రభుత్వాలు కార్యచరణ పత్రాన్ని సిద్ధం చేసుకోవాలి. పాలకుడి నిన్నటి నిర్లక్ష్యానికి నేడు సామాన్యుడు శిక్ష అనుభవిస్తున్నాడు. నేడు మళ్లీ అదే నిర్లక్ష్యం చేస్తే ఈ సారి సామాన్యుడు తిరగబడతాడు...!

- ఎ. రేవంత్ రెడ్డి, లోక్ సభ సభ్యుడు, మల్కాజ్ గిరి

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !