కల్లోలంలో గందరగోళం - చనిపోయిన వృద్దురాలు వాపసొచ్చింది !


74 ఏళ్ల అల్బ మరూరి ఈక్వెడార్ మహిళ. కరోనావైరస్ సోకి ఆస్పత్రిలో చేరారు. ఆమె చేరిన కొద్ది రోజులకు ఆస్పత్రి వర్గాలు మరూరి మరణించారన్న సమాచారాన్ని ఆమె కుటుంబానికి చేరవేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె అస్థికలు ఇవేనంటూ ఓ మూటను కూడా పంపారు.

కాగా, మూడు వారాలు కోమాలో ఉన్న మరూరీకి గురవారం నాడు తెలివి వచ్చింది. వెంటనే ఆమె తన సోదరిని పిలవమని వైద్యుల్ని కోరారు. ఈ వార్త వినగానే ఆమె కుటుంబం ఒక్కసారిగా చెప్పలేనంత సంతోషంలో మునిగిపోయింది. అయితే, వైద్యులు ఎవరి అస్థికల్ని తమకు పంపారన్న విషయం మాత్రం వారికి అర్థం కాలేదు. జరిగిన తప్పునకు ఆస్పత్రి వర్గాలు క్షమాపణ చెప్పాయి. మరూరి ఈక్వెడార్‌లో కోవిడ్-19 సంక్షోభానికి కేంద్ర బిందువైన గ్వయాకీల్ నగరంలో నివసిస్తున్నారు. కరోనావైరస్‌ దెబ్బకు విలవిలలాడుతున్న దేశాల్లో ఈక్వెడార్‌ కూడా ఒకటి. ఇప్పటివరకు అక్కడ 20వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదుకాగా, సుమారు 600 మంది ప్రాణాలు కోల్పోయారు.
క్షమాపణ చెప్పిన ఆస్పత్రి వర్గాలు
స్థానిక పత్రిక ఎల్ కమర్షియో కథనం ప్రకారం తీవ్రమైన జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులతో మరూరి గత నెలలో ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి వర్గాలు ఆమె మార్చి 27న మరణించారన్న వార్తను కుటుంబ సభ్యులకు తెలిపాయి. ఆ తర్వాత మార్చురీలో ఉన్న ఓ శవాన్ని వారికి చూపించారు. అయితే ఎక్కడ కరోనావైరస్ సోకుతుందేమోనన్న భయంతో దూరంగా ఉంచారు. ఆమె బహుశా తమ అత్తగారే అయి ఉంటారని ఆస్పత్రి వర్గాలకు తెలిపినట్లు మరూరి బంధువుల్లో ఒకరైన జెమీ మోర్లా ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు. “ఆమె ముఖాన్ని చూడటానికి నాకు చాలా భయం వేసింది. సుమారు ఓ మీటరు దూరం నుంచే చూశాను. అదే జుత్తు, అదే రంగు” అని అన్నారు.

ఆ తర్వాత ఆ శవానికి అంత్యక్రియలు నిర్వహించి, ఆ అస్థికల్నే మరూరి కుటుంబానికి పంపించాయి ఆస్పత్రి వర్గాలు. కానీ, గురువారం కోమా నుంచి బయటకు వచ్చిన మరౌరీ తాను చేరినప్పటి పరిస్థితులన్నింటినీ గుర్తు చేసి, వైద్యులకు తన పేరు చెప్పి ఆశ్చర్యపరిచారు. అలాగే తన ఇంటి ఫోన్ నెంబర్ చెప్పి తనను ఇంటికి తీసుకెళ్లేందుకు తన సోదరిని పిలిపించమని అడిగారు. ఆస్పత్రికి చెందిన ఓ వైద్య బృందం ఆమె ఇంటికి వెళ్లి తాము చేసిన పొరపాటుకు క్షమించాలని వేడుకున్నట్టు స్థానిక పత్రిక ఎల్ కమర్షియో తెలిపింది. ఒక్కసారిగా కరోనా కేసులు, మరణాలు ఎక్కువవడంతో ఆస్పత్రిలో తలెత్తిన గందరగోళ పరిస్థితుల కారణంగా ఈ తప్పు జరిగిందని వివరణ ఇచ్చినట్టు ఆ పత్రిక పేర్కొంది.

“నిజంగా ఇదో అద్భుతం. చనిపోయిందనుకున్న మనిషి నెల రోజుల తర్వాత తిరిగొచ్చారు. బహుశా, అంతకు ముందు వారు ఎవరి అస్థికలో మాకు పంపించారు.” అని ఆమె సోదరి అన్నారు. అయితే, అంత్యక్రియలకు అయిన ఖర్చుల్ని తిరిగి ఇప్పించాలని ఆస్పత్రి వర్గాలకు విజ్ఞప్తి చేయనున్నట్లు మరూరి కుటుంబ సభ్యులు తెలిపారు. సహజంగా ఇంట్లో ఎవరైనా చనిపోతే వారు చివరి సమయంలో వాడిన బట్టల్ని, మంచం, పరుపుల్ని బయటే పడేసే సంప్రదాయాన్ని కొందరు పాటిస్తుంటారు. మరూరి కుటుంబం కూడా అదే పని చేసింది. అప్పటి వరకు ఆమె వాడిన పరుపును బయట పడేసింది. దీంతో, ఇప్పుడు ఆమె మరో కొత్త పరుపు కొని తెచ్చుకున్నారు.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !