లాక్ డౌన్ ఆంక్షల పేరు చెప్పి ఓ ఎస్సై తమ గ్రామ ప్రజలను చిత్తబడుతున్నారని గరిడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కీతవారిగూడెం సర్పంచ్, ఉపసర్పంచ్ స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి సోషల్ మీడియా ద్వారా బహిరంగ వినతిపత్రం రాశారు. గరిడేపల్లి ఎస్సై వెంకన్నగౌడ్ స్థానికులను ఎలా చావగొట్టారనే విషయాన్ని ఈ కింది విధంగా వివరించారు.

1) కల్మల్ చెరువులో బోధకాల పేషెంటును, 2) కీతవారిగూడెం గ్రామంలో పొలంలోకి వెళ్లి మరీ రైతును కొట్టారు. 3) ఇదే గ్రామంలో కాటా వేస్తున్న కూలీలను తరిమితరిమి కొడుతుంటే ఒక వ్యక్తికి కాలు విరిగింది. 4) గరిడేపల్లిలో కిడ్నీ పేషెంటును, 5) రాయినిగూడెంలో వ్యాపారిని 6) చర్చివద్ద అన్నం తింటున్న ఓ క్రైస్తవున్ని సదరు ఎస్సై గారు తీవ్రంగా చితకబాదారని కీతవారిగూడెం సర్పంచ్ కీత జ్యోతి రామారావు, ఉపసర్పంచ్ ఎల్లావుల అంజయ్య ఎమ్మెల్యేతో తమ గోడు వెల్లబోసుకున్నారు. కరోనాతో చస్తామో లేదో తెలియదు గానీ గరిడేపల్లి ఎస్సై దెబ్బలకు మాత్రం మండలంలో ఎవరో ఒకరు చనిపోయే భయానక పరిస్థితి నెలకొందని వారు ఆరోపించారు. కనీస మానవత్వం కూడా మరిచి, కారణం కూడా అడుగకుండా జనాలను అడ్డదొడ్డంగా చితకబాదుతూ శారీరక, మానసిక వేధింపులకు గురిచేస్తున్న ఎస్సై వెంకన్నగౌడ్ నుంచి రక్షించాలని వారు ఎమ్మెల్యేను వేడుకున్నారు.
Comments
Post a Comment