నిర్బంధంలో పెరిగిన అశ్లీల వీక్షణం !
లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూసే వారి సంఖ్య భారీగా పెరిగిందని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) నిర్ధారణకు వచ్చింది. ఈ మేరకు Google, Whatsapp, Twitter సంస్థలకు నోటీసులు కూడా జారీ చేసింది.
NCPCR సంస్థ ఆన్లైన్లో చైల్డ్ పోర్నోగ్రఫీ లభ్యత మీద ఒక స్వతంత్ర సర్వేను నిర్వహించింది. అందులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. Google Play Storeలో లభించే కొన్ని అప్లికేషన్లను ఇన్స్టాల్ చేసుకుంటే అభ్యంతరకరమైన పోర్నోగ్రఫీ మెటీరియల్ లభిస్తోందని, చాలామంది వాటిని డౌన్లోడ్ చేసుకొని అలాంటి కంటెంట్ వినియోగిస్తున్నారని ఆ సంస్థ గ్రహించింది. ఇది పరోక్షంగా చట్టవ్యతిరేకమైన కంటెంట్‌ని సులభంగా వినియోగించుకోవడానికి అవకాశం కల్పించటమేనని అభిప్రాయపడింది. మార్చి 24 తర్వాత దేశంలో లాక్‌డౌన్ అమల్లోకి వచ్చాక ఏకంగా 95% ఛైల్డ్ పోర్నోగ్రఫీ వినియోగం పెరిగిందని NCPCR గుర్తించింది.
దేశవ్యాప్తంగా అనేక మంది చిన్న పిల్లలు ఇలాంటి కంటెంట్ బారిన పడే ప్రమాదం ఉంది కాబట్టి దీనికి సంబంధించి కమిషన్ వివిధ టెక్నాలజీ దిగ్గజాలకు హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని ప్రత్యేకమైన వాట్సప్ గ్రూపులలో ఇలాంటి వీడియోలు విచ్చలవిడిగా షేర్ అవుతున్నట్లు, వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని Whatsappని కమిషన్ ఆదేశించింది. అలాంటి ప్రమాదకరమైన వాట్సాప్ గ్రూప్ లకు సంబంధించిన లింకులు Twitterలో చలామణి కావడం పట్ల కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
Twitterలో 13 సంవత్సరాల వయసు ఉన్నవారు అకౌంట్ ఓపెన్ చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించిన Twitter సంస్థ సరిగ్గా అదే విధంగా పోర్నోగ్రఫిక్ మెటీరియల్, లింకులను పెట్టడానికి ఎలా అనుమతిస్తోంది అంటూ Twitterని చైల్డ్ రైట్స్ కమిషన్ నిలదీసింది. ఏప్రిల్ 30 నాటికి ఆయా సంస్థలు వెంటనే స్పందించాలని, తగిన సమాచారం అందించాలని Google, Twitter, Whatsappలను ఆదేశించింది. ఇదిలా ఉంటే ఒక అంతర్జాతీయ ప్రముఖ పోర్నోగ్రఫీ వెబ్‌సైట్ లాక్ డౌన్ తర్వాత తమ సైట్ సందర్శించే భారతీయ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిందని, 300% ఎక్కువగా ట్రాఫిక్ పొందుతున్నామని గణాంకాలు వెల్లడించడం గమనార్హం.
Comments
Post a Comment