భారత్ డబ్బులు ముద్రించొచ్చు - నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ
దేశంలో కొనసాగుతున్న లాక్‌డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన లక్షలాది మందికి ఉపశమనం కల్పించడంలో భారతదేశం "మరింత ఉదారంగా" వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ వినాయక్ బెనర్జీ పేర్కొన్నారు. "మనం తగినంత కృషి చేయలేదు" అని ఈ భారతీయ-అమెరికన్ విద్యావేత్త, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ప్రొఫెసర్ బీబీసీతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. మార్చి 24న లాక్‌డౌన్ విధించిన తరువాత భారతదేశం 2300 కోట్ల డాలర్ల ఉపశమన ప్యాకేజీ ప్రకటించింది. అందులో ఎక్కువ భాగం నగదు బదిలీ, పేదలకు ఆహార భద్రతకు కేటాయించింది. "ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదు. ఎవరూ చేతిలో డబ్బు లేకుండా ఉండకూడదు" అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ సమయంలో చెప్పారు.
సహ పరిశోధకులు ఎస్తేర్ డఫ్లో, మైఖేల్ క్రెమెర్‌లతో కలిసి 2019లో ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ప్రొఫెసర్ బెనర్జీ.. కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించటానికి "వ్యవస్థను స్తంభింపజేయాలన్న ప్రభుత్వ ఆలోచన సరైనదే.. కానీ లాక్‌డౌన్‌తో కథ ముగియదు. టీకా లభ్యమయ్యే వరకూ ఈ వ్యాధి చాలా కాలం పాటు మనను వెంటాడుతూనే ఉంటుంది. ఆ టీకా ఇప్పుడప్పుడే అందుబాటులోకి రాదు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. "తర్వాత ఏం చేయాలనే విషయంలో భారతదేశం విస్పష్టమైన ప్రణాళిక గురించి ఆలోచించాలి. ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే డిమాండ్ మాంద్యాన్ని ఎదుర్కొంది. కరోనావైరస్ వ్యాప్తి దెబ్బమీద దెబ్బలా తగిలింది. చాలా మంది ప్రజలు ఉపాధి కోల్పోయారు. ఇప్పుడు డిమాండ్ మాంద్యం మరింతగా పెరిగింది’’ అని చెప్పారాయన.
ఉపాధి కోల్పోవడం వల్ల పేదరికాన్ని ఎదుర్కొంటున్న ప్రజలను ఆదుకోవటానికి భారత ప్రభుత్వం నిధులు ఖర్చు చేసే విషయంలో మరింత ఉదారంగా ఉండాలన్నారు. "మార్కెట్లు మూతబడినప్పుడు ప్రజలకు డబ్బు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏమిటనే ప్రశ్న వస్తుందని నాకు తెలుసు. కానీ, ముందుగా.. డబ్బులు రాబోతున్నాయని ప్రజలకు చెప్పటం ద్వారా డిమాండ్ పెరిగే పరిస్థితికి సంసిద్ధం చేయవచ్చు. ప్రజలకు భరోసా అవసరం. ఆ భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం చురుకుగా స్పందించాలి" అని ఆయన పేర్కొన్నారు. వస్తువులు, సేవల సరఫరాల మీద ఆంక్షలను సడలించి, అవి తిరిగి ప్రారంభమైనప్పుడు జనం చేతుల్లో డబ్బులు ఉండాలని, అలావుంటే వారు బయటకు వెళ్లి ఖర్చుచేయటం మొదలుపెట్టగలరని వివరించారు.
భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకుంటున్న వారి జాబితాలోని కోట్లాది గృహాలకు అటువంటి ప్రత్యక్ష నగదు ప్రయోజనాలను అందించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు కాని మిగతా జనాభాను గుర్తించి, వారి జేబుల్లోకి డబ్బు అందేలా చూడటానికి స్థానికంగా సామాజిక నివేదన వ్యవస్థలను ఏర్పాటు చేయవచ్చునన్నారు. ‘‘అనేక మార్గాలున్నాయి. ప్రయోజనానికి ఎవరు అర్హులు, ఎవరు కాదు అనేది గుర్తించటం అన్ని వేళల్లో కచ్చితంగా ఉండదు. కానీ ప్రస్తుత సమయంలో ప్రాధాన్యం ఇవ్వాల్సింది కచ్చితత్వానికి కాదు. ఇది అత్యవసర పరిస్థితి’’ అని ఆయన అభివర్ణించారు. సంక్షేమ ప్రయోజనాలను విస్తరించటం కోసం నిధులు సమకూర్చేందుకు నగదు ముద్రించడానికి భారతదేశం భయపడాల్సిన అవసరం లేదని ప్రొఫెసర్ బెనర్జీ అభిప్రాయపడ్డారు.
"నగదు ముద్రించి ఖర్చు చేయవచ్చని అమెరికా అభిప్రాయపడింది. భారతదేశం అలా ఎందుకు చేయకూడదో నాకు తెలియదు" అన్నారాయన. "వస్తువులు, సేవలు తగినంతగా అందుబాటులో లేనపుడు ద్రవ్యోల్బణం ఉంటుందనే ఆందోళన కావచ్చు. కానీ ఇప్పుడు తలెత్తిన ఆదాయ అంతరాన్ని పూడ్చటానికి భారత్ ఏదో ఒకటి చేయాలి. డబ్బు ఖర్చు చేసే విషయంలో ప్రభుత్వం మరింత దూకుడుగా ఉండాలి" అని పేర్కొన్నారు. "కొత్తగా కరోనావైరస్ సోకకుండా, అది మరణాలకు కారణమై మరోసారి లాక్‌డౌన్‌కు దారితీయకుండా.. సరకులు, సేవల సరఫరా శ్రేణిని ఎలా పునఃప్రారంభిస్తారనేది అన్నిటికన్నా పెద్ద సవాలు’’ అని ప్రొఫెసర్ బెనర్జీ చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ 2020-21లో 1.5 శాతం నుంచి 2.8 శాతం మధ్య మాత్రమే వృద్ధి చెందుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా. ఓ స్వతంత్ర అంచనా ప్రకారం నిరుద్యోగం తీవ్రంగా పెరిగింది. కీలకమైన సేవా రంగాలకు వెన్నెముక వంటి వలస కార్మికులు కార్యాలయాలు మూసివేయటంతో అక్కడి నుంచి వెళ్లిపోవటమో, నగరాల్లోని సహాయ కేంద్రాల్లో చిక్కుకుపోవటమో జరిగింది.
Comments
Post a Comment