చిన్నారి ఆకలి పరుగు !
వాళ్లు అసలే భిక్షమెత్తుకొని జీవించే విధి వంచితులు.. అసలే వారి బతుకులు కడు దుర్భరంగా ఉంటాయి.. వాళ్లకున్న కష్టాలు చాలవన్నట్లు కరోనా సంక్షోభం ఆ బడుగు జీవుల కష్టాలను మరింత దయనీయంగా మార్చేశాయి. ఎక్కడ పడితే అక్కడ అన్నం కోసం గుమిగూడుతున్నారని భద్రాద్రి కొత్తగూడెంలో అధికారులు యాచకులందరినీ స్థానిక బస్టాండులో పెట్టారు. రోజూ దాతలు ఇక్కడికే వచ్చి వీరికి ఆహరం, ఇతర వస్తువులు ఇచ్చి వెళ్తున్నారు. మొన్న శుక్రవారం కూడా ఓ దాత యాచకులకు అహరహం ఇవ్వడానికి రాగా, అప్పటికే చిన్నపిల్లలు సహా ఆకలితో ఆహరం కోసం ఎదురుచూస్తున్న యాచకులందరూ ఒకేసారి ఆ దాత వైపు పరుగెత్తుకువచ్చారు. దీంతో బెదిరిపోయిన ఆ దాత కొంతమందికి మాత్రమే ఇచ్చి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
కానీ, ఎలాగైనా ఆహరం దక్కించుకోవాలని ఓ యాచక చిన్నారి దాత కారు వెంట పరుగులు పెట్టాడు. కానీ, ఇతడి కష్టం వృథాగానే పోయింది. చిన్నారి పరుగును గమనించని ఆ దాత వెళ్లిపోయాడు. కానీ, చిన్నారి పరుగును చూసిన స్థానికులు చలించిపోయారు. యాచకులకు ప్రభుత్వమే ఏవైనా ఏర్పాట్లు చేయాలని వారు కోరారు. ఇలాంటి దయనీయ దృశ్యాలు కరోనా కాలం మొదలైనప్పటి నుంచి దేశంలో కోకొల్లలుగా ఇంటర్నెట్లో వైరాలవుతున్నాయి.

Comments
Post a Comment