బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అస్తమయం


బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణించారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మంగళవారం నుంచి ఆరోగ్యపరిస్థితి విషమంగానే ఉందని, ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందించేందుకు ప్రయత్నించామని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఉన్నట్లుండి ఆరోగ్యం ఎందుకు విషమించిందనే దానిపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇర్ఫాన్ కుటుంబం నుంచి కూడా ఎవరూ ఏమీ మాట్లాడలేదు.
1967 జనవరి 7న ఇర్ఫాన్ జన్మించారు. ఇర్ఫాన్ ఖాన్ దాదాపు 100 సినిమాల్లో నటించారు. మహేశ్ బాబు నటించిన తెలుగు సినిమా సైనికుడులో కూడా ప్రతినాయక పాత్ర పోషించారు. బాలీవుడ్ హిట్ సినిమాలైన పీకూ, మక్భూల్, హాసిల్, పాన్ సింగ్ తోమర్‌లలో ఆయన ముఖ్యపాత్ర పోషించారు. లైఫ్ ఆఫ్ పై, జురాసిక్ వరల్డ్, స్లమ్‌డాగ్ మిలియనీర్, ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ వంటి ఇంగ్లిష్ చిత్రాలు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి.

అంతర్జాతీయంగా కూడా ఇర్ఫాన్‌కు ఎందరో అభిమానులున్నారు. 2013లో ఆయన పాన్ సింగ్ తోమర్ సినిమాకు గాను నేషనల్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్నారు. ఇది బందిపోటుగా మారిన ఓ అథ్లెట్ జీవిత కథ. 2013లో ది లంచ్ బాక్స్ సినిమాకు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వ్యూయర్స్ ఛాయిస్ అవార్డు గెలుచుకున్నారు. ఆ సంవత్సరం భారత్ నుంచి ఈ ఫెస్టివల్‌కు ఎంపికనైన చిత్రం ఇదొక్కటే.

ప్రముఖ నటుల సంతాపం
ఇర్ఫాన్ కాన్ మృతి సినీ ప్రపంచానికి తీరని లోటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వివిధ మాధ్యమాలలో ఆయన అద్భుత ప్రదర్శనలు ఎప్పటికీ గుర్తుంటాయని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని అంటూ ట్వీట్ చేశారు. "ఓ అద్భుతమైన నటుణ్ని కోల్పోయాం. ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఇర్ఫాన్ కుటుంబానికి నా సానుభూతి" అని తెలుగు సినీ నటుడు మహేశ్ బాబు ట్వీట్ చేశారు. "ఉదయాన్నే ఓ చెడువార్త తెలిసింది. చాలా షాక్‌కు గురయ్యాను. ఆయనతో కలిసి నటించినందుకు సంతోషిస్తున్నా. ఆయన పనిచేసే తీరు, ప్రతిభ, హుందాతనం ఎప్పుడూ గొప్పగానే ఉండేవి" అని సినీ నటి త్రిష ట్వీట్ చేశారు. చాలా బాధాకరమైన విషయం అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. "సినీ ప్రపంచానికి ఇదో పెద్ద విషాదం. ఆయనతో కలిసి నటించే అవకాశం నాకు దక్కలేదు. కానీ ఆయనో అద్భుత ప్రతిభ ఉన్న నటుడు అని మాత్రం చెప్పగలను" అని వెంకటేశ్ ట్వీట్ చేశారు. "నా స్నేహితుడు ఇర్ఫాన్ మరణించారు, ఇంతకంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు. అద్భుతమైన నటుల్లో ఆయన కూడా ఒకరు. మంచి వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా" అని అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు.

ఇర్ఫాన్ ఖాన్‌కు ఉన్న వ్యాధి ఏంటి?
53ఏళ్ల ఇర్ఫాన్ ఖాన్ న్యూరోఎండోక్రైన్ ట్యూమర్‌తో బాధపడుతున్నారు. ఆయనకు ఈ వ్యాధి ఉన్నట్లు 2018 మార్చిలోనే నిర్థరణైంది. ఆయన తనకు తానే ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా అందరికీ తెలియచేశారు. తాను ఓ ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నానని 2018 మార్చి 5 వెల్లడించారు. "నా జీవితంలో ఉన్నట్లుండి ఇలా జరిగింది. ఇలాగే ముందుకు సాగాలి. నా చివరి రోజులు దీనితోనే గడపాలి. నాకు న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ అనే వ్యాధి ఉన్నట్లు తేలింది. కానీ, నా చుట్టూ ఉన్న నన్ను ప్రేమించే మనుషులే నాకు జీవితంపై ఆశను, జీవించడానికి కావలసిన ధైర్యాన్ని ఇస్తున్నారు" అని ఆయన ఓ ట్వీట్ చేశారు. తనకు ఈ వ్యాధి ఉన్నట్లు తెలిసిన వెంటనే ఆయన చికిత్స కోసం లండన్ వెళ్లారు. దాదాపు సంవత్సరం పాటు అక్కడే ఉండి చికిత్స తీసుకున్నారు. 2019 మార్చిలో ఇర్ఫాన్ భారత్‌కు తిరిగి వచ్చారు. ఆ తర్వాత కూడా ముంబయిలోని కోకిలాబెన్ హాస్పిటల్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. 'అంగ్రేజీ మీడియం' చిత్ర నిర్మాణ సమయంలోనే ఆయన అనారోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. దీంతో ఆ సినిమా షూటింగ్ పనులు కూడా నిలిచిపోయాయి. ఆయన కొద్దిగా కోలుకున్న తర్వాత మళ్లీ షూటింగ్ చేశారు. ఇటీవలే ఇర్ఫాన్ తల్లి సయీదా బేగం జైపూర్‌లో మరణించారు. లాక్ డౌన్ కారణంగా ఆయన తన తల్లి అంత్యక్రియలకు కూడా హాజరుకాలేకపోయారు. వీడియో కాల్ ద్వారా తన తల్లి అంత్యక్రియలను ఆయన చూశారని సన్నిహితులు చెబుతారు.

ఈ ట్యూమర్‌తో ఏం జరుగుతుంది?
న్యూరో ఎండ్రోక్రైన్ ట్యూమర్ అనేది ఓ అరుదైన వ్యాధి. ఇది శరీరంలో ఏ అవయవానికైనా రావచ్చు. అయితే, ఇప్పటివరకూ ఉన్న రోగుల వివరాలను బట్టి ఇది ఎక్కువమందిలో పేగుల్లో సంభవిస్తోందని అర్థమవుతోంది. ముందుగా ఇది రక్తంలోకి వివిధ హార్మోన్లను విడుదల చేసే కణజాలంపై ప్రభావం చూపి అవి అధిక స్థాయిలో విడుదలయ్యేలా చేస్తుంది. కొన్నిసార్లు ఈ వ్యాధి ప్రభావం నెమ్మదిగా ఉన్నప్పటికీ, అన్ని సందర్భాల్లోనూ, అందరి విషయంలోనూ ఇలా ఉంటుందని కచ్చితంగా చెప్పలేం.

దీని లక్షణాలు ఏంటి?
శరీరంలో ఏ భాగానికి ఈ వ్యాధి సోకిందనే దాన్ని బట్టి లక్షణాలు మారిపోతుంటాయి. ఉదాహరణకు, పొట్ట భాగంలో ఈ ట్యూమర్ వస్తే ఆ రోగికి మలబద్ధకం వంటి సమస్య ఎదురుకావచ్చు. ఊపిరితిత్తుల్లో వస్తే శ్వాససంబంధ సమస్యలు రావచ్చు. రోగి రక్తపోటు, చక్కెర స్థాయులు పెరిగిపోతాయి. ఈ వ్యాధి సోకినవారందరూ చనిపోతారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఈ ట్యూమర్‌కు అనేక కారణాలుంటాయి. కొన్ని సందర్భాల్లో జన్యుపరంగా కూడా రావచ్చు. కుటుంబంలో ఎవరికైనా ఇది గతంలో వచ్చి ఉంటే అలాంటి వారికి ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ. అనేకరకాల రక్తపరీక్షలు, స్కానింగ్‌లు, బయాప్సీల తర్వాత మాత్రమే ఇది నిర్థరణ అవుతుంది.

చికిత్స ఉందా లేదా?
ట్యూమర్ ఏ దశలో ఉంది, ఏ భాగానికి సోకింది, రోగి ఆరోగ్య స్థితి ఏంటి అనే దాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ ద్వారా దీన్ని తొలగించవచ్చు. కానీ చాలా రోగుల విషయంలో ఈ సర్జరీని వ్యాధి తీవ్రతను నెమ్మదింపచేయడానికి మాత్రమే ఉపయోగించగలరు. కొన్ని మందుల ద్వారా కూడా శరీరంలో హార్మోన్ల విడుదలను నియంత్రిస్తూ రోగికి కాస్త ఉపశమనం కలిగించే అవకాశం ఉంది.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !