మీడియాలో ఉద్యోగ సంక్షోభం!
కొన్ని మీడియా హౌజుల్లో, ప్రత్యేకించి పత్రికా సంస్థల్లో ఉద్యోగులకు ఇంకా కరోనా సెగ తగల్లేదు. అందుకని పత్రిక సంక్షోభం, జీతాల కోతలు, కొలువుల కత్తిరింపుల వార్తలన్నీ ట్రాష్ అనే భ్రమల్లో ఉన్నారు కొందరు..!
అడవి అంటుకుంటుంది..
ఒకసారి కార్చిచ్చు రగిలాక అది 'మర్రి చెట్టా, వేప చెట్టా, రేగి చెట్టా, గడ్డి మొక్కా' అనే తేడా ఉండదు… కాస్త అటూఇటూ లేటు, అంతే… జాతీయస్థాయిలో ఎన్ని పత్రికలు, ఎన్ని వెబ్ సైట్లు, ఎన్ని టీవీల్లో ఎందరిని ఇళ్లకు పంపించేశారు, ఎంతగా జీతాల్లో కోతలు పడ్డాయో మొన్న చెప్పుకున్నాం కదా…!
తెలుగు మీడియాకూ పాకింది..
తెలుగులోనూ సంక్షోభం వేగంగానే కమ్ముకొస్తున్నది… అది ఆఫీసుల్లో పనిచేసే సబ్‌ఎడిటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, టెక్నిషియన్లు, ఫోటోగ్రాఫర్లు, రిపోర్టర్లకే పరిమితం కావడం లేదు. చివరకు కంట్రిబ్యూటర్ల వ్యవస్థ దాకా వ్యాపిస్తున్నది. వ్యాపించింది కూడా. ఉదాహరణ ఏమిటంటే..? వెలుగు..! మొన్నమొన్ననే లాంచ్ చేసినట్టు ఉంది కదా…! అప్పుడే సబ్ ఎడిటర్లు, రిపోర్టర్లపై పడింది పిడుగు. ఇప్పుడు కంట్రిబ్యూటర్లకూ పాకింది.
నియోజకవర్గానికి ఒకరే..!
ఉమ్మడి జిల్లాకు ఓ బ్యూరో చీఫ్, ప్రతి జిల్లాకు ఓ స్టాఫర్, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ కంట్రిబ్యూటర్… అంతే… మిగతా వాళ్లందరినీ తీసేస్తున్నట్టు సమాచారం పంపిస్తున్నారు. నిజానికి వాళ్లకు ఇచ్చే '2000 లేదా 2500 కూడా ఒక పత్రిక భారంగా పరిగణిస్తున్నదీ' అంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఎడాపెడా సబ్ ఎడిటర్లను, రిపోర్టర్లను, ఫీచర్స్ స్టాఫ్‌ను ఇళ్లకు పంపించేసి, 25 శాతం జీతం రెండు నెలల దాకా ఇస్తాం అంటున్నది. ఆంధ్రజ్యోతి రెగ్యులర్ ఉద్యోగుల జీతాల్లో 20, 25 శాతం కోత పెట్టేసింది.
పీసీ ఇంఛార్జిలకూ కత్తెర..
ఏడెనిమిది వేల నుంచి పది వేల దాకా వేతనాలు పొందే పీసీ ఇన్‌చార్జులకూ కత్తెర పడింది. 2500కు కుదించేశారు జీతాన్ని… నిజానికి ఆంధ్రజ్యోతి వ్యవస్థకు వాళ్లే కీలకం…!
టాబ్లాయిడ్ లకూ మంగళం..
మరి ఇప్పుడు ఒక్కో పత్రిక కంట్రిబ్యూటర్లనూ తొలగించే పనిలో పడిందీ అంటే… ఇక టాబ్లాయిడ్లకు మంగళం పాడినట్టే..! *డిసెంబరు దాకా టాబ్లాయిడ్లు ఉండవు* అని ప్రధాన పత్రికల్లో చెబుతున్నా సరే, ఆ తరువాత కూడా ఉండక పోవచ్చునని పరిస్థితులు చెబుతున్నాయి..! ఇక సండే మ్యాగజైన్లు, ఫీచర్స్ పేజీలు ఎత్తేస్తే, ఆ సబ్ ఎడిటర్లకూ మూడినట్టే..! ఈనాడుకు చాలా ఏళ్ల తరువాత తొలిసారిగా నష్టాలు మొదలయ్యాయట…! ఎన్నడూ లేనిది కార్డు ప్రైస్… అంటే నిర్ణీత టారిఫ్‌లో కూడా యాడ్స్‌కు భారీ ఎత్తున రాయితీలు ఇవ్వటానికి ముందుకొస్తున్నది… గతంలో తనెంత రేటు చెబితే అంత అన్నట్టుగా ఉండేది…
న్యూస్ ఫ్రింట్ సంక్షోభం..
న్యూస్ ప్రింట్ నిల్వలు పెద్దగా లేవు… పెద్ద పత్రికలన్నీ ఎక్కువగా రష్యా తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాయి. ఇప్పటికిప్పుడు కరోనా లాక్ డౌన్ ఎత్తేసినా న్యూస్ ప్రింట్ సప్లయి కావటానికి నెలలు పట్టొచ్చు… ఎందుకైనా మంచిదని అందరూ పేజీలు తగ్గించారు కాబట్టి కొన్నాళ్ల వరకూ ఢోకా లేదు… ఆ తరువాత న్యూస్ ప్రింట్ సంక్షోభం కూడా రాబోతున్నది… ప్రభుత్వం సుంకాలు తగ్గిస్తుందనీ, యాడ్స్ పెంచుతుందనీ ఆశించడం ఓ భ్రమ… రాష్ట్రాలు, కేంద్రం వద్ద డబ్బుల్లేవు… ఉదారంగా వ్యవహరించే సీన్ ఏమాత్రం లేదు… ఇవన్నీ నిజాలే… నిష్ఠురంగా ఉన్నా కళ్ల ఎదుట కనిపిస్తున్న నిజ పరిణామాలే…! *_ఎవరినీ భయపెట్టడం లేదు… మీడియా పరిస్థితిని కళ్లముందు ఉంచుతున్నది… నిజానికి మనం ఇక్కడ అనుకున్న దానికన్నా సీరియస్‌గానే విషయం ఉంది..!
(మంచాల శ్రీనివాస్ గారి కలం నుంచి)

Comments
Post a Comment