మహమ్మారికి మందు ఎప్పుడు వస్తుంది.. దాన్ని ఎలా తయారు చేస్తారు?
చైనాలో పుట్టుకువచ్చిన కరోనావైరస్ ఇప్పుడు 177కుపైగా దేశాలకు పాకింది. శనివారం (మార్చి 28) మధ్యాహ్నం వరకు భారతదేశంలో 775 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. 19 మంది చనిపోయారు. ఏపీలో 12, తెలంగాణలో 45 మందికి కోవిడ్-19 సోకినట్లు తేలింది. ప్రపంచవ్యాప్తంగా 5,98,245కు పైగా ప్రజలకు కరోనావైరస్ సోకింది. 27,762 మంది చనిపోయారు. అయితే, ఈ వ్యాధి రాకుండా చేసే వ్యాక్సిన్ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ఇందుకు కారణం ఏంటి? అసలు వ్యాక్సిన్ వస్తుందా?
ఎప్పుడు వస్తుంది?
కరోనావైరస్ నుంచి రక్షణ కల్పించే వ్యాక్సిన్ తయారీ దిశగా అడుగులు పడ్డాయి. ఇప్పటికి 20 వ్యాక్సిన్లు తయారీలో ఉన్నాయి. వీటిలో ఒకదానిని నేరుగా మనుషులపైనే ప్రయోగిస్తున్నారు. మిగతా వాటిని జంతువులపై ప్రయోగిస్తున్నారు. ఇవి విజయవంతం అయితే మనుషులపై ప్రయోగాలు మొదలు పెడతారు. ఈ ఏడాది చివరాఖరికి ఫలితాలు వెలువడొచ్చు. ఈ వ్యాక్సిన్ల సామర్థ్యం, భద్రత ఎంత అనేది తెలుసుకునేందుకు పరిశోధకులు కృషి చేస్తున్నారు. ఒకవేళ ఈ ఏడాది చివరి నాటికి శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాల్లో విజయవంతమైనా, వాటిని భారీగా ఉత్పత్తి చేయడం పెద్ద సవాలే. వాస్తవికంగా ఆలోచిస్తే, వచ్చే సంవత్సరం మధ్యలోకి వచ్చేవరకూ వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవచ్చు. పైగా కాలంతో పరుగులుపెడుతూ, కొత్త విధానాల్లో శాస్త్రవేత్తలు ఇదంతా చేస్తున్నారు. కాబట్టి, అంతా ప్రణాళిక ప్రకారం సజావుగా జరుగుతుందని కూడా చెప్పలేం. మనుషులకు సోకే కరోనావైరస్ రకాలు ఇప్పటికే నాలుగు ఉన్నాయి. వాటి వల్ల జలుబు వస్తుంది. వాటిలో దేనికీ ఇప్పటి వరకూ కూడా వ్యాక్సిన్ లేదన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి.
అన్ని వయసుల వారినీ ఈ వ్యాక్సిన్ రక్షిస్తుందా?
వయసు పైబడ్డవారిపై ఈ వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పనిచేసే అవకాశాలు చాలా తక్కువ. అంటే వ్యాక్సిన్ సరిగా పనిచేయట్లేదని కాదు. వయసు మీదపడ్డవారిలో రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. వ్యాక్సిన్లకు అది అంతగా స్పందించదు. ప్రతి ఏటా ఫ్లూ వ్యాక్సిన్ల విషయంలో జరిగేదదే.
ఈ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా?
అన్ని ఔషధాలకూ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, పారాసిటమాల్‌తో సహా. ఇప్పుడు అభివృద్ధి చేసే వ్యాక్సిన్‌ను మనుషి శరీరంలోకి ప్రవేశపెడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో క్లినికల్ పరీక్షలు నిర్వహించకుండా తెలుసుకోవడం అసాధ్యం.
వ్యాక్సిన్ వచ్చేలోపు చికిత్సలేం ఉన్నాయి?
వ్యాక్సిన్లు ఇన్‌ఫెక్షన్లు రాకుండా రక్షణ కల్పిస్తాయి. కానీ, వాటిని అడ్డుకునేందుకు అత్యుత్తమ విధానం పరిశుభ్రత పాటించడమే. కరోనావైరస్ సోకినా, చాలా మందిపై దాని ప్రభావం స్వల్పంగానే ఉంటుంది. క్లినికల్ ట్రయల్స్‌లో కొన్ని యాంటీ-వైరల్ ఔషధాలను వాడుతున్నారు. అయితే అవి పనిచేస్తాయో, లేదో కచ్చితంగానైతే చెప్పలేం.
వ్యాక్సిన్లను ఎలా తయారుచేస్తారు?
వైరస్ లేదా బ్యాక్టీరియా (లేదా వాటిలో కొన్ని భాగాలు)ను వ్యాక్సిన్లు హానిరహితంగా మార్చి రోగ నిరోధక వ్యవస్థ ముందు ప్రవేశపెడతాయి. రోగ నిరోధక వ్యవస్థ వాటిని బయటి నుంచి వచ్చిన హానికారకాలుగా గుర్తించి, వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటుంది. ఆ తర్వాత నిజమైన వైరస్, బ్యాక్టీరియా వచ్చినా అది ఎదుర్కోగలదు. దశాబ్దాలుగా వ్యాక్సినేషన్‌లో అసలు వైరస్‌ను ఉపయోగించే పద్ధతినే ప్రధానంగా వాడుతున్నారు. ఎమ్ఎమ్ఆర్ వ్యాక్సిన్‌ను ఇలాగే అసలు వైరస్‌లను బలహీనపరిచి తయారుచేస్తారు. వాటి వల్ల పూర్తి స్థాయి ఇన్‌ఫెక్షన్ రాదు. సీజనల్ ఫ్లూని కలిగించే ప్రధాన రకాలను తీసుకుని కూడా ఇలాగే వ్యాక్సిన్లు అభివృద్ధి చేస్తారు. కరోనావైరస్ వ్యాక్సిన్ కోసం మాత్రం కొత్త పద్ధతిలో పని జరుగుతోంది. పరీక్షలు తక్కువగా చేస్తున్నారు. వీటిని ‘ప్లగ్ అండ్ ప్లే’ విధానాలు అంటున్నారు. కొత్త కరోనావైరస్ సార్స్-సీఓవీ-2 జన్యు కోడ్ మనకు తెలుసు. ఆ వైరస్‌ను నిర్మించడానికి అవసరమైన పూర్తి మ్యాప్ మన దగ్గర ఉంది. కొందరు శాస్త్రవేత్తలు కరోనావైరస్ జన్యు కోడ్‌లో కొన్ని భాగాలను తీసుకుని పూర్తి హానిరహితమైన వైరస్‌ల్లో ప్రవేశపెడుతున్నారు. అంటే, సిద్ధాంతపరంగా ఈ హానిరహిత వైరస్‌ను సోకించి, ఆ ఇన్‌ఫెక్షన్‌కు వ్యాధి నిరోధకత వచ్చేలా చేయొచ్చు. ఇంకొందరు పరిశోధకులు మూల జన్యు కోడ్‌లో (డీఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ)లోని కొన్ని భాగాలను వాడుతున్నారు. వాటిని శరీరంలో ప్రవేశపెడితే, కొన్ని వైరల్ ప్రోటీన్‌లు ఉత్పత్తి అవుతాయి. ఇలా కూడా రోగ నిరోధక వ్యవస్థ దాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటుంది.
Comments
Post a Comment