అమెరికా వర్సెస్ చైనా... పోటాపోటీగా కుట్ర


కరోనావైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి అనేక కుట్ర సిద్ధాంతాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. వైరస్ పుట్టుక గురించి చాలా కథలు ప్రచారంలోకి వచ్చాయి. చైనా ‘రహస్య జీవ ఆయుధాల అభివృద్ధి కార్యక్రమం’లో భాగంగా కరోనావైరస్ బయటకు వచ్చిందని కట్టుకథ కూడా వీటిలో ఉంది. కెనడా-చైనీస్ గూఢచర్య బృందం కరోనావైరస్‌ను వుహాన్‌కు పంపారన్న నిరాధార వాదన కూడా ఇలాగే వ్యాపించింది. ఈ వాదనను కుట్ర సిద్ధాంతాలను ప్రచారం చేసే ఫేస్‌బుక్ గ్రూపులు, ట్విటర్ ఖాతాలు మరింత ప్రచారం చేశాయి. రష్యా ప్రభుత్వ మీడియాలోనూ దీనికి సంబంధించిన వార్తలు ప్రముఖంగా వచ్చాయి. వైరస్ వ్యాప్తి మొదలై కొన్ని నెలలు గడుస్తున్నా ఈ కుట్ర సిద్ధాంతాలు ఆగిపోలేదు. మరిన్ని కొత్త వాదనలు బయటకు వచ్చాయి. అమెరికా, చైనాల్లోని ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, మీడియా సంస్థలు కూడా వీటికి వంత పాడారు. కోవిడ్-19 అమెరికాలోనే పుట్టి ఉండొచ్చంటూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జాయో లిజియాన్ ఏ ఆధారాలూ లేకుండానే పదేపదే వ్యాఖ్యానించారు. అమెరికా సైన్యం వైరస్‌ను వుహాన్‌కు తెచ్చి ఉండొచ్చని మార్చి 12న ఆయన ట్వీట్ చేశారు.

‘వైరస్ అమెరికాలో పుట్టిందనడానికి మరిన్ని ఆధారాలు’ అంటూ గ్లోబల్ రీసెర్చ్ అనే వెబ్‌సైట్ ప్రచురించిన కథనాన్ని మరుసటి రోజు లిజియాన్ ట్వీట్ చేశారు. ఆ కథనాన్ని యూజర్స్ చదవాలని, మరింత మందికి షేర్ చేయాలని కూడా కోరారు. కానీ, ఆ కథనాన్ని తర్వాత గ్లోబల్ రీసెర్చ్ డిలీట్ చేసింది. లిజియాన్‌ ప్రకటనను చైనీస్ పత్రిక ద గ్లోబల్ టైమ్స్ కూడా ప్రచురించింది. అయితే, ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగత స్థాయిలో చేసినవని పేర్కొంది. చైనా ప్రజలకు కూడా లిజియాన్ తరహాలోనే సందేహాలున్నాయని రాసింది. చైనా దౌత్య కార్యలయాలు, ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని సోషల్ మీడియా యూజర్లు కూడా లిజియాన్ వాదనతో శ్రుతి కలిపారు. లిజియాన్ సోషల్ మీడియాలో తరచూ ఎక్కువగానే మాట్లాడుతుంటారని, చైనా నాయకత్వ వైఖరినే ఆయన వ్యాఖ్యలు ఎప్పుడూ ప్రతిబింబిస్తాయని చెప్పలేమని బీబీసీ మానిటరింగ్ చైనా నిపుణుడు కెర్రీ ఎలెన్ అన్నారు.

గ్లోబల్ రీసెర్చ్ వెబ్‌సైట్ కెనడాలో 2001లో స్థాపితమైన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ గ్లోబలైజేషన్ సంస్థ. అమెరికన్ ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్ పొలిటీఫ్యాక్ట్ సమాచారం ప్రకారం గ్లోబల్ రీసెర్చ్ 9/11 దాడులు, వ్యాక్సిన్లు, గ్లోబల్ వార్మింగ్ వంటి అంశాలపైనా తప్పుదోవ పట్టించే అనేక కుట్ర సిద్ధాంతాలను ప్రచురించింది. లిజియాన్ ట్వీట్ చేసిన ఆర్టికల్ ల్యారీ రోమనాఫ్ అనే వ్యక్తి పేరుతో ఉంది. ఆ పేరుతో అందులో చాలా కథనాలు ఉన్నాయి. వైరస్ చైనాలో పుట్టలేదంటూ ఇదివరకు రాసిన కథనాన్ని మరోసారి ప్రస్తావిస్తూ రోమనాఫ్ ఆ కథనం రాశారు. కానీ, ఆ కథనం కూడా ఇప్పుడు వెబ్‌సైట్‌లో లేదు. రోమనాఫ్ తన కథనంలో ప్రస్తావించిన ఆర్టికల్స్, పరిశోధనలు వుహాన్‌లోని జంతువుల మార్కెట్‌లో వైరస్ పుట్టి ఉండకపోవచ్చని మాత్రమే పేర్కొన్నాయి.

కరోనావైరస్ అమెరికాలోనే పుట్టి ఉండొచ్చని జపాన్, తైవాన్ శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారని రోమనాఫ్ ఆ కథనంలో రాశారు. కానీ, ఆయన ఆధారంగా చేసుకున్న జపనీస్ టీవీ కథనం తప్పని తేలింది. చైనా అనుకూల పార్టీలో చేరిన మాజీ ఫార్మాసాలజీ ప్రొఫెసర్‌ను రోమనాఫ్ ‘ప్రముఖ వైరాలజిస్ట్’గా పేర్కొన్నారు. వైరస్ ఫోర్ట్ డెట్రిక్‌లోని అమెరికా సైనిక జెర్మ్ ల్యాబోరేటరీలో పుట్టి ఉండొచ్చని ఏ ఆధారాలూ లేకుండానే రోమనాఫ్ రాశారు. ప్యాథోజెన్ లీకేజీ లేకుండా గత ఏడాది ఆ ల్యాబ్‌ను పూర్తిగా మూసేసిన నేపథ్యంలో ఈ విషయం ఆశ్చర్యపోనవసరం లేదని కూడా రాశారు. అయితే, ఆ ల్యాబ్ మూతపడలేదని, పరిశోధనలు మాత్రమే ఆగిపోయాయని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. ‘ల్యాబ్ నుంచి ప్రమాదకరమైన పదార్థాలేవీ బయటకు పొక్కలేదని’ ల్యాబ్ అధికార ప్రతినిధి వెల్లడించినట్లు తెలిపింది. షాంఘైలోని ఫుడాన్ యూనివర్సిటీలో విసిటింగ్ ప్రొఫెసర్‌గా, విశ్రాంత మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా, వ్యాపారిగా తనను తాను పేర్కొన్నారు. సీనియర్ ఈఎంబీఏ తరగతులకు అంతర్జాతీయ వ్యవహారాలపై పాఠాలు చెబుతుంటానని తెలిపారు. ఆ యూనివర్సిటీ రెండు ఎంబీఏ కోర్సులకు సంబంధించిన అధికారులు మాత్రం రోమనాఫ్ గురించి తమకు తెలియదని చెప్పినట్లు ద వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక పేర్కొంది. రోమనాఫ్ ఫుడాన్ యూనివర్సిటీలో విసిటింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నారా అన్న విషయమై బీబీసీ కూడా ఆ యూనివర్సిటీని సంప్రదించింది. కానీ, యూనివర్సిటీ స్పందించలేదు. అమెరికాను విమర్శిస్తూ, చైనాను సమర్థిస్తూ రోమనాఫ్ కథనాలు ఎక్కువగా ఉన్నాయి. 1989లో టియనామెన్ స్క్వేర్‌లో జరిగిన ఆందోళనలను ‘అమెరికా ప్రేరేపిత విప్లవం’గా వర్ణిస్తూ కూడా ఆయన ఓ కథనం రాశారు.

కరోనావైరస్ వ్యాప్తి మొదలైన తొలి రోజుల్లో కోవిడ్-19 చైనీయులను లక్ష్యంగా చేయసుకునేందుకు రూపొందిందని, మిగతా జాతీయులకు అది సోకదని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రోమనాఫ్‌ స్పందన కోసం బీబీసీ ప్రయత్నించింది. కానీ, ఆయన నుంచి స్పందన రాలేదు. అమెరికాలోనే వైరస్ పుట్టి ఉండొచ్చన్న చైనా ప్రభుత్వ వర్గాలు, మీడియా వ్యాఖ్యలపై అమెరికా స్పందించాల్సి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు కరోనావైరస్‌ను ‘చైనీస్ వైరస్’గా పేర్కొన్నారు. చైనా అసత్యాలను ప్రచారం చేయడం మానుకోవాలని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో డిమాండ్ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పూర్తిగా చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ట్రంప్ ఇటీవల ఆరోపించారు. ఆ సంస్థకు నిధులు నిలిపివేస్తామని కూడా ప్రకటించారు. అయితే, నిధుల నిలిపివేతకు ఇది ‘సరైన సమయం కాదు’ అని ఐరాస సెక్రటరీ జనరల్ టెడ్రోస్ అదనమ్ స్పందించారు. చాలా మంది అమెరికా రాజకీయ నాయకులు, విశ్లేషకులు కూడా కరోనావైరస్ ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై మాట్లాడారు. ఫాక్స్ న్యూస్‌ టీవీ ఛానెల్ వ్యాఖ్యాత టకర్ కార్ల్సన్ వుహాన్‌లోని ల్యాబ్ నుంచి కరోనావైరస్ ప్రమాదవశాత్తు బయటకు వచ్చి ఉండే ఆస్కారముందన్న అధ్యయనం గురించి ప్రస్తావించారు. రిపబ్లికన్ సెనేటర్లు టామ్ కాటన్, టెడ్ క్రూజ్ కూడా ఇదే వాదన చేశారు. వారు పేర్కొన్న అధ్యయనం గాంగ్జౌలోని సౌత్ చైనా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఇద్దరు పరిశోధకులు చేసింది. అయితే, అది పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. ఆ అధ్యయానాన్ని తాము ఉపసంహరించుకున్నట్లు కూడా సదరు పరిశోధకుల్లో ఒకరైన షియావో వాల్ స్ట్రీట్ జర్నల్‌కు తెలిపారు. మీడియా కథనాలు, ఇతర పరిశోధన పత్రాల ఆధారంగానే తాము ఆ అధ్యయనం చేశామని, తమ వాదనను బలపరిచే ప్రత్యక్ష ఆధారాలేవీ లభించలేదని చెప్పారు.

2018లో ఇద్దరు అమెరికా దౌత్యవేత్తలు వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీని సందర్శించారని, ‘గబ్బిలాలపై ప్రమాదకర పరిశోధనలు చేస్తున్న ల్యాబ్‌లు తగిన రీతిలో భద్రతా చర్యలు లేవు’ అని అమెరికా ప్రభుత్వానికి నివేదించినట్లు వాషింగ్టన్ పోస్ట్ ఇటీవల ఓ కథనం ప్రచురించింది.


‘‘వైరస్ ల్యాబ్‌లో పుట్టిందని సైన్స్ కచ్చితంగా చెప్పడం లేదు. కానీ, అలా జరిగే అవకాశాలు తక్కువే ఉన్నాయని సూచిస్తోంది’’ అని ఎబోలా సమయంలో అమెరికా ప్రభుత్వ చర్యల్లో కీలక బాధ్యతలను నిర్వర్తించిన జెరెమీ కోనిండిక్ అభిప్రాయపడ్డారు.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !